ఇది పురోహితురాలు చేసిన పెళ్లి!

10-02-2020 Mon 19:16
  • చెన్నైలో ఆసక్తికర వివాహం
  • పెళ్లిలో వేదమంత్రాలు చదివిన మహిళ
  • ఆశ్చర్యానికి గురైన అతిథులు

ఓ తెలుగమ్మాయి కోరిక మేరకు ఆమె పెళ్లిని ఓ పురోహితురాలు నిర్వహించారు. సుష్మ అనే అమ్మాయి ఓ లాయర్. ఆమెకు తమిళనాడు యువకుడు విఘ్నేశ్ రాఘవన్ తో పెళ్లి కుదిరింది. తన పెళ్లికి ఓ మహిళ పౌరోహిత్యం వహించాలని సుష్మ తన తండ్రిని కోరింది. అయితే, హిందూ వ్యవస్థలో పురుషులే పౌరోహిత్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు భిన్నంగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. అయితే సుష్మ తండ్రి సురేశ్ రెడ్డి కుమార్తె కోసం ఎంతో శ్రమించి మైసూరులో ఉండే భ్రమరాంబ మహేశ్వరి అనే పురోహితురాలిని గుర్తించారు.

భ్రమరాంబ వేదపారంగతురాలు. సురేశ్ రెడ్డి ప్రతిపాదనకు అంగీకరించిన ఆమె చెన్నై విచ్చేసి సుష్మ, విఘ్నేశ్ ల పెళ్లిలో వేదమంత్రాలు చదివి వివాహ క్రతువు నిర్వహించారు. దీనిపై సుష్మ, ఆమె తండ్రి మాత్రమే కాదు పెళ్లికి వచ్చినవాళ్లందరూ అచ్చెరువొందారు. భ్రమరాంబ మహేశ్వరి మంత్రాలు చదివిన తీరుకు వారు ముగ్ధులయ్యారు. అంతేకాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా పెళ్లిళ్లు కుదిరితే పిలుస్తామంటూ ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు.