Anili kumar Yadav: ‘పోలవరం’ పనులు ఆగిపోయాయన్నది ‘ఎల్లో మీడియా’ దుష్ప్రచారం: మంత్రి అనిల్ కుమార్

  • చంద్రబాబు గురించి గొప్పగా రాసుకుంటే రాసుకోండి
  • ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దు
  • ప్రతిపక్షంలో ఉండీ అధికారులను బెదిరిస్తున్నారు

పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం తగదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి వార్తలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. చంద్రబాబు గురించి గొప్పగా రాసుకుంటే ఎల్లో మీడియా రాసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్న దుష్ప్రచారంతో పాటు పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తమ వాళ్ల కాంట్రాక్టు పనులు పోయాయని టీడీపీ నేతలు బాధపడుతూ ఇలా తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు.

'నాలుగున్నరేళ్ల తర్వాత టీడీపీ ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి, అధికారుల అంతు చూస్తుందట' అంటూ సెటైర్లు విసిరారు. గత ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయి రక్తం గడ్డ కట్టినట్టుందని, ఒకసారి స్కాన్ చేయిస్తే మంచిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారులకు ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్న టీడీపీ నేతలు, అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా వ్యవహరించి ఉంటారు? అని అనిల్ ప్రశ్నించారు.

More Telugu News