British Airways: తుపాను గాలులు ముందుకు నెట్టడంతో... రికార్డు వేగంతో దూసుకుపోయిన బ్రిటన్ విమానం

  • యూకేలో సియారా తుపాను విధ్వంసం
  • ఆకాశంలో జెట్ స్ట్రీమ్ ఉత్పన్నం
  • గాలివాలును అనుకూలంగా మార్చుకున్న విమానం
  •  విపరీతమైన వేగం అందుకున్న వైనం

శాస్త్ర పరిభాషలో 'జెట్ స్ట్రీమ్' గా పిలిచే తుపాను గాలులు పెనువేగంతో వీస్తుంటాయి. భూమికి 30 వేల అడుగుల ఎత్తులో అత్యంత బలంగా వీచే ఈ గాలులు సముద్రంలో ఉత్పన్నమయ్యే తుపానుకు ఏమాత్రం తీసిపోవు. తాజాగా, గగనతలంలో ఈ తరహా 'జెట్ స్ట్రీమ్' లో ప్రవేశించిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం, ఆ రాకాసి గాలివాలును తనకు అనుకూలంగా మలుచుకుని నమ్మశక్యం కాని వేగంతో దూసుకుపోయింది.

వెనుకనుంచి తుపాను గాలి ముందుకు నెడుతుంటే, మరోవైపు ఇంజిన్లు అందించే శక్తిని ఉపయోగించుకుని న్యూయార్క్ నుంచి లండన్ కు కేవలం 4 గంటల 56 నిమిషాల్లో ప్రయాణించి ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ క్రమంలో గంటకు 1287 కిమీ వేగంతో దూసుకెళ్లింది.

బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 747 విమానం అంత దూరాన్ని అవలీలగా ప్రయాణించిందంటే అందుకు కారణం జెట్ స్ట్రీమ్ గాలులే. ప్రస్తుతం బ్రిటన్ లో సియారా తుపాను విలయం సృష్టిస్తోంది. దీని కారణంగా ఏర్పడిన జెట్ స్ట్రీమ్ బోయింగ్ విమానాన్ని ఒక్క ఊపుతో ముందుకు తోసుకెళ్లింది.

కాగా, ఈ మార్గంలో ఇప్పటివరకు నార్వే ఎయిర్ లైన్స్ విమానం అత్యుత్తమంగా 5 గంటల 13 నిమిషాల్లో ప్రయాణించగా, బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం ఇప్పుడా రికార్డును బద్దలు కొట్టింది. కాగా, తుపాను గాలులకు ఎదురు ప్రయాణించిన విమానాలు మాత్రం షెడ్యూల్ టైము కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా గమ్యస్థానాలు చేరుతున్నాయి.

More Telugu News