cyber crime: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు...వేడుకలంటూ వల!

  • భారీ కార్యక్రమం కాంట్రాక్టు ఇస్తామంటూ ఫోన్ 
  • మాయలో పడ్డారో ఖాతా ఖాళీయే
  • నిర్వాహకులే లక్ష్యం

జనాన్ని మాయచేసి కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. సరికొత్త పంథాలో మోసాలకు తెర తీస్తున్నారు. తాజాగా భారీ కార్యక్రమాల కాంట్రాక్టు ఇస్తున్నామంటూ వల వేస్తున్నారు. ఎవరైనా పడ్డారో... అంతే వారి ఖాతా ఖాళీ కావడం ఖాయం. 

వివరాల్లోకి వెళితే... ఇటు బ్యాంకులు, అటు పోలీసులు, మరోవైపు పలు సంస్థలు సైబర్ నేరగాళ్ల మోసాలు వెల్లడిస్తుండడం, మోసపోయిన బాధితుల గురించి ప్రసార మాధ్యమాల్లో చదువుతుండడంతో ఇటీవల కాలంలో జనంలో చైతన్యం గణనీయంగా పెరిగింది. దీంతో ఇంతకు ముందులా సైబర్ నేరగాళ్ల పప్పులు ఉడకడం లేదు. అందుకే పుట్టినరోజు, వివాహం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ కాంట్రాక్టు ఇస్తామని వల విసురుతున్నారు. నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారు.

హైదరాబాద్ బర్కతపురాలో ఉంటున్న ఈవెంట్ మేనేజర్ కృష్ణకు కొద్దిరోజుల క్రితం ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. తానో సైన్యాధికారినని, ఈనెల 16న తన కొడుకు పుట్టినరోజని, అధికారులు, బంధువులు భారీ సంఖ్యలో వస్తారని తెలిపాడు. ఇందుకోసం రూ.20 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించానని, అందరికీ అనుకూలంగా ఉండేందుకు రాజేంద్రనగర్ లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచిస్తూ వివరాలు తెలియజేశాడు.

భారీ కాంట్రాక్టు వస్తోందన్న ఆశతో కృష్ణ మీరు చెప్పిన సౌకర్యాలతో రూ.15 లక్షల్లోనే కార్యక్రమం పూర్తి చేస్తానని తెలిపాడు. వేదిక, అతిథులు, భోజనాల గురించి మాట్లాడేందుకు ఇప్పుడే వస్తున్నానంటూ చెప్పగా అత్యవసరంగా తాను ఢిల్లీ వెళ్తున్నానని, రెండు రోజుల తర్వాత కలుద్దామని చెప్పాడు. ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు నటించి, 'పోనీ రెండు రోజుల తర్వాత కలవడం ఎందుకు, మీకు అడ్వాన్స్ గా రూ.50 వేలు ఇప్పుడే ఇస్తాను, మీ గూగుల్ పే అడ్రస్ పంపించండి' అంటూ వలవిసిరాడు.

భారీ కాంట్రాక్టు లభిస్తుందన్న మాయలో ఉన్న కృష్ణ గూగుల్ పే నంబర్ పంపగా దానికి ఓ వంద రూపాయలు పంపాడు. అనంతరం ఫోన్ చేసి టెస్ట్ కోసం రూ.వంద పంపించాను, మీ ఫోన్ కి ఓ లింక్ పంపుతున్నాను, దానిలో వివరాలు నమోదుచేసి పంపిస్తే డబ్బు జమ చేస్తానంటూ చెప్పాడు. సరేనన్న కృష్ణ సంబంధిత లింకు తెరిచి వివరాలు పూరించి పంపించాడు.

అక్కడికి ఐదు నిమిషాల తర్వాత అతని ఖాతా నుంచి రూ. 55 వేలు విత్ డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. ఏదోమోసం జరిగిందని కంగారుపడినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News