Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల... నేడు వస్తే, రేపే దర్శనం!

  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
  • దర్శనానికి 20 గంటల సమయం
  • అన్న పానీయాలు అందిస్తున్న టీటీడీ

దేవదేవుడు కొలువైన తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోగా, భక్తుల క్యూ లైన్ నారాయణవనం ఉద్యాన వనం వరకూ పెరిగింది. నేడు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు రేపు దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనానికి కనీసం 20 గంటల సమయం పడుతుందని తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని అన్నారు. శనివారం నాడు స్వామివారిని 90 వేల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. 

కాగా, నేడు తిరుమలలో పున్నమి గరుడసేవ జరుగనుండటం, వారాంతం కావడంతోనే రద్దీ పెరిగిందని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు అందిస్తున్నామని తెలిపారు. ఇదిలావుండగా, రేపు స్వామివారిని దర్శించుకునేందుకు శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సే రానున్నారు.

More Telugu News