Russia: రెండో ప్రపంచ యుద్ధం అక్కాచెల్లెళ్లను విడదీసింది... ఇప్పుడు టీవీ కార్యక్రమం కలిపింది!

  • 78 ఏళ్ల తర్వాత ఒక్కటైన సోదరిలు
  • ఉద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు 
  • రష్యాలోని స్టాలినోగ్రాడ్ కు చెందిన వారు

ఎప్పుడో 78 ఏళ్ల క్రితం నాటి మాట. రెండో ప్రపంచ యుద్ధం ప్రకంపనలతో ప్రపంచం దద్దరిల్లుతున్న సమయంలో అక్కాచెల్లెళ్లయిన ఆ చిన్నారులు విడిపోయారు. ఇటీవల జరిగిన ఓ టీవీ షోలో మళ్లీ కలుసుకుని.. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పరస్పరం ముద్దులు కురిపించుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... రష్యాలోని స్టాలిన్ గ్రాడ్ (నేటి వోల్గోగ్రాడ్)లో అక్కాచెల్లెళ్లు యులియా, రోలినా ఖరితోనోవాలు తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ సైన్యం ఆ నగరాన్ని చుట్టుముట్టడంతో రష్యా అధికారులు ఆ నగరంలోని పౌరులను ఖాళీ చేయించారు. యులియాను ఆమె తల్లితో కలిసి పెంజానగరానికి తరలించారు. రోజాలినాను ఆమె పనిచేస్తున్న కర్మాగారం సహచర కార్మికులతో కలిసి చెల్యాబిన్స్క నగరానికి పంపారు.

ఆ విధంగా ఎడబాటుకు గురైన అక్కాచెల్లెళ్లు ఆ తర్వాత కలుసుకోలేకపోయారు. తన సోదరి ఆచూకీ కనిపెట్టాలని యులియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదై ఉంది. ఈ నేపథ్యంలో చెల్యాబిన్స్కలో జరిగిన ఓ టీవీ కార్యక్రమం సందర్భంగా అనుకోకుండా ఈ అక్కాచెల్లెళ్లు తారసపడ్డారు.

పోలీసులు కూడా వెతుకుతుండడంతో ఆ సందర్భంగా వీరి ఎడబాటుకు శుభం కార్డు పడింది. ప్రస్తుతం యులియా వయసు 92 సంవత్సరాలు కాగా, రోలినా ఖరితోనోవా వయసు 94 ఏళ్లు.

More Telugu News