Chandrababu: దావోస్ లో ఒకప్పుడు ఏపీ పేరు మార్మోగిపోయేది: చంద్రబాబు

  • ఇప్పుడు ఏపీ అంటే భయపడే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు
  • పిచ్చి నిర్ణయాలతో ఏపీని భ్రష్టుపట్టించారని ఆగ్రహం
  • తొమ్మిది నెలలు గడుస్తున్నా ఒక్క కంపెనీ వచ్చిందా? అంటూ మండిపాటు

కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోతోందన్న వార్తల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి అనేక సంస్థలు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కడన్నా దెయ్యం ఉందంటే ఎవరూ వెళ్లరని, ఇప్పుడు ఏపీ పరిస్థితి అలాగే ఉందని విమర్శించారు.

రూ.70 వేల కోట్ల విలువైన అదానీ డేటా సెంటర్, రూ. 3,000 కోట్ల విలువైన లులూ కన్వెన్షన్ సెంటర్, హోటల్, ఎగ్జిబిషన్ సెంటర్, రూ.50 వేల కోట్ల విలువైన సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సిద్ధపడ్డాయని, మరో 130 సంస్థలు కూడా మొగ్గు చూపాయని చంద్రబాబు వివరించారు. దాంతో 50 వేల మందికి ఉద్యోగాలు లభించేవని చెప్పారు. కానీ ప్రస్తుత పరిణామాల కారణంగా అన్నీ వెనుకంజ వేస్తున్నాయని, రూ.25 వేల కోట్ల విలువైన పేపర్ మిల్లు కూడా వెనక్కిపోయిందని అన్నారు. తిరుపతిలో హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకొస్తే అది ఫేక్, బోగస్ కంపెనీ అని వాళ్లను కూడా తరిమేశారని మండిపడ్డారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు.

రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు చేశామని, అప్పటివరకు 40 శాతం, 50 శాతం సక్సెస్ రేట్ వచ్చిందని వెల్లడించారు. మీరు వచ్చి తొమ్మిది నెలలు అయింది ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు ఎందుకు అని ప్రశ్నించారు. "ప్రపంచంలో ప్రతిచోట ఒకే రాజధాని ఉంటే ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ఏపీని భ్రష్టుపట్టించారు. పెట్టుబడులన్నీ పక్కకు మళ్లిపోతున్నాయి. వీళ్లను చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు దావోస్ లో ఏపీ పేరు మార్మోగిపోయేది. ఇప్పుడు దావోస్ వెళితే, పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకునే ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు వెళ్లాలని అడిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇండస్ట్రీ పెడతామని ఏపీఐఐసీకి వెళితే ఎందుకొచ్చారని అడుగుతారా? గతిలేక వస్తారా ఎవరైనా? మీ గొప్పదనం చూసి కంపెనీలు వెతుక్కుంటూ వస్తాయా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News