Ambati Rayudu: రాయుడు పరిస్థితి దురదృష్టకరం... నేనూ బాధపడ్డాను: ఎమ్మెస్కే

  • వరల్డ్ కప్ జట్టులో రాయుడికి మొండిచేయి
  • అప్పట్లో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కేపై రాయుడి సెటైర్
  • అదో సున్నితమైన అంశంగా పేర్కొన్న ఎమ్మెస్కే

ఎంతో ప్రతిభ ఉండి కూడా తగిన అవకాశాలు రాక తెరమరుగైన ఆటగాళ్లలో అంబటి రాయుడు ఒకడు. ప్రపంచకప్ జట్టులో చోటు ఆశించి భంగపడిన రాయుడు అప్పటి సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పై సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ కు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేస్తూ అతడు మూడు కోణాల్లో ఉపయోగపడే ఆటగాడని ఎమ్మెస్కే వ్యాఖ్యానించాడు. దానిపై రాయుడు వ్యంగ్యం ప్రదర్శిస్తూ, అయితే వరల్డ్ కప్ చూసేందుకు త్రీడీ కళ్లజోడు కొనుక్కుంటానని బదులిచ్చాడు.

ఆ తర్వాత రాయుడు టీమిండియాకు ఎంపికైంది లేదు. దేశవాళీ పోటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు ఆవేశంగా ప్రకటించాడు. ఆ తర్వాత రిటైర్మెంటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా జాతీయ జట్టు అవకాశాలు రాలేదు. ఈ పరిస్థితిపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.

రాయుడి పరిస్థితి చాలా బాధాకరమని, వరల్డ్ కప్ లో రాయుడికి చోటు దక్కనందుకు తాను ఎంతో చింతించానని తెలిపాడు. రాయుడికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

"ప్రపంచకప్ కు రాయుడ్ని ఎంపిక చేయకపోవడం సున్నితమైన అంశం. రాయుడ్ని టెస్టుల్లో కూడా ప్రోత్సహించాలని భావించి ఆ దిశగా అతడ్ని సన్నద్ధం చేసేందుకు ప్రయత్నించాం. రాయుడి ఫిట్ నెస్ గురించి జాతీయ క్రికెట్ అకాడమీ ట్రైనర్ల ద్వారా సాయం అందించాం. అతడు కూడా ఫిట్ గా తయారై కొన్ని మ్యాచ్ ల్లో రాణించాడు. కానీ వరల్డ్ కప్ కు వచ్చేసరికి అతడ్ని ఎంపిక చేయలేకపోయాం. అదో దురదృష్టకర నిర్ణయం" అంటూ విచారం వ్యక్తం చేశారు. కాగా, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం పూర్తికావడంతో త్వరలోనే సీనియర్ సెలెక్షన్ కమిటీకి కొత్త చీఫ్ రానున్నాడు.

More Telugu News