ఈ అవినీతి ఆయనకు కనిపిస్తున్నట్టు లేదు: జగన్ ను ఎన్.రామ్ కలవడంపై ఐవైఆర్ విమర్శలు

06-02-2020 Thu 09:24
  • నిన్న జగన్ నివాసానికి వెళ్లిన హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్.రామ్
  • ఇద్దరూ కలిసి ఒకే కారులో పయనం
  • ఇతర సీఎంల కంటే జగన్ పైనే ఎందుకంత అభిమానం అన్న ఐవైఆర్

ప్రముఖ మీడియా సంస్థ 'హిందూ' గ్రూప్ ఛైర్మన్ ఎన్.రామ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని గేట్ వే హోటల్ లో జరిగిన 'ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రామ్.... జగన్ నివాసానికి వెళ్లారు. అక్కడే అల్పాహారం తీసుకున్న తర్వాత జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే కారులో బయల్దేరారు. సాధారణంగా కారులో ముందు సీట్లో కూర్చునే జగన్... రామ్ తో కలిసి వెనక సీట్లో కూర్చోవడం గమనార్హం.

ఇదంతా పక్కన పెడితే జగన్ ను రామ్ కలవడాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. 'హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ గారికి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ గారిపై ప్రత్యేక అభిమానం. కారణాలేంటో వారి ఇరువురికే తెలియాలి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని బీరాలు పలికే  రామ్ గారికి ఈ అవినీతి కనిపిస్తున్నట్టు లేదు' అని ట్వీట్ చేశారు.