Jagan: నేను ఎవరినీ తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదు: సీఎం జగన్

  • తాను చేయగలిగిందే చెబుతున్నానన్న సీఎం
  • అమరావతి నిర్మాణం కుదిరేపని కాదని స్పష్టీకరణ
  • నిధుల కొరత వల్లే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడి

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు.

ఇక అమరావతి గురించి మాట్లాడుతూ, శాసన రాజధానిగా అమరావతే ఉంటుందని, అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. అయితే అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు కావాలని, కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ. 2 కోట్ల మేర వ్యయం అవుతుందని వెల్లడించారు. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

కానీ ఏపీలో విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అని, విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయని స్పష్టం చేశారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో పది శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరుతో పోటీపడుతుందని వివరించారు. నిధుల కొరత వల్లే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుదోవపట్టించాలనుకోవడంలేదని సీఎం జగన్ ఉద్ఘాటించారు. బాహుబలి గ్రాఫిక్స్ చూపించాలనుకోవడంలేదని అన్నారు.

తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని, రాయలసీమ ప్రాజెక్టులు నిండడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.25 వేల కోట్లు కావాలని, తాను ఎక్కడి నుంచి నిధులు తేగలనని అన్నారు. జపాన్, సింగపూర్ తరహాలో నగరాలను సృష్టించేంత నిధులు తమవద్ద లేవని, తాను ఎంతవరకు చేయగలనో ఆ వాస్తవాలే చెబుతున్నానని పేర్కొన్నారు.

More Telugu News