సినీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల కోసం అల్లు అర్జున్ ఆర్థికసాయం

05-02-2020 Wed 18:03
  • బన్నీని కలిసిన ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు 
  • అల.. వైకుంఠపురములో చిత్రం విజయానికి బన్నీకి అభినందనలు
  • రూ.10 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భంగా వారు బన్నీకి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సంక్షేమం కోసం ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సభ్యులు కృషి చేస్తున్న తీరును బన్నీ అభినందించారు. ఈ సందర్భంగా వారికి తనవంతుగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.

అయితే, తాము వచ్చింది అల... వైకుంఠపురములో చిత్రం విజయం పట్ల అభినందించడానికి మాత్రమేనని, ఆర్థికసాయం కోరేందుకు కాదని ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నిజాయతీగా స్పందించారు. దాంతో అల్లు అర్జున్ బదులిస్తూ, మీరు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నాకు కూడా నచ్చాయని, అందుకే ఈ ప్రోత్సాహక నగదు ఇస్తున్నానని, మున్ముందు కూడా మరింతగా ఆర్థిక చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. పాత్రికేయులు లేకపోతే సినిమాలు జనాల్లోకి వెళ్లలేవని, అలాంటి వారి కోసం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో తాను కూడా భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.