కాసేపట్లో పెళ్లనగా.. వరుడిని కాల్చిచంపిన దుండగులు!

05-02-2020 Wed 13:05
  • యూపీ, దేవగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • దుండగులు బైకుపై వచ్చి కాల్పులు
  • పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అంబరాన్నంటేలా పెళ్లి వేడుక చేయాలనుకున్నారు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. ముహూర్తం దగ్గరపడుతోందని హడావుడిగా వరుడు, వధువు తరఫు బంధువులు పెళ్లి మండపానికి వచ్చారు. ఇంతలో ఊహించని ఘటన.. పెళ్లి మండపం వద్దే వరుడిపై దుండగులు తుపాకీతో గురి చూసి కాల్చారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని దేవగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీర్‌పూర్‌ బజార్‌లో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వరుడే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వరుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.