China: యువతి సమయస్ఫూర్తి.. తనను రేప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని పరుగులు పెట్టించిన వైనం!

  • చైనాలోని జింగ్‌షాన్ పట్టణంలో ఘటన
  • తనకు కరోనా వైరస్ సోకిందని చిన్నగా దగ్గి చెప్పిన బాధిత యువతి
  • ఆమె సమయస్ఫూర్తికి ప్రశంసలు

ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి అత్యాచారం నుంచి తప్పించుకుంది. అంతేకాదు, రేపిస్ట్‌ను భయంతో వణికించి పరుగులు పెట్టేలా చేసింది. చైనాలోని జింగ్‌షాన్ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను చూసిన దుండగుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. సరిగ్గా అప్పుడే ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో ప్రపంచం వణుకుతున్న నేపథ్యంలో.. తనపై అత్యాచారానికి ఒడిగట్టేందుకు వచ్చిన యువకుడు జియావో ముఖంపై చిన్నగా దగ్గి తనకు కరోనా వైరస్ ఉన్నట్టు చెప్పింది. తనది కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరమని, తనకు కూడా కరోనా వైరస్ సోకిందని చెప్పడంతో రేపిస్ట్ వణికిపోయాడు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు.

అయితే, అత్యాచార యత్నాన్ని విరమించుకున్న నిందితుడు ఆమె ఇంట్లో కనిపించిన రూ.30 వేల విలువైన సొత్తును దోచుకెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా నిందితుడే తండ్రితో సహా వచ్చి పోలీసులకు లొంగిపోవడం విశేషం. సమయస్ఫూర్తితో వ్యవహరించి తెలివిగా తప్పించుకున్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

More Telugu News