BJP: బీజేపీ నేత రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు.. 12 ఏళ్లుగా దారుణానికి తెగబడుతున్నాడని మహిళ ఫిర్యాదు!

  • ఓ కేసులో ఇంటికి రమ్మని పిలిచి అత్యాచారం
  • నగ్న చిత్రాలను నెట్‌లో పెడతానని బెదిరింపు
  • సజ్జనార్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధిత మహిళ

బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు నమోదైంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్‌కు చెందిన బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి రఘునందన్‌పై ఫిర్యాదు చేసింది. గత 12 ఏళ్లుగా అతడు తనకు నరకం చూపిస్తున్నాడని ఆరోపించింది. కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని కమిషనర్ ఎదుట వాపోయింది. కమిషనర్ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో రఘునందన్‌పై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహాని తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ 2003లో భర్తపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. అనంతరం అడ్వకేట్ అయిన రఘునందన్‌ను కలిసి పోషణ ఖర్చుల కోసం ఆయన సాయంతో సంగారెడ్డి కోర్టులో కేసు వేసింది. 2 డిసెంబరు 2007న కేసు గురించి మాట్లాడదాం రమ్మని ఇంటికి పిలిచిన రఘునందన్.. కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటపెడితే నగ్న చిత్రాలను నెట్‌లో పెడతానని బెదిరించాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనకున్న రాజకీయ పలుకుబడితో తనను బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

గతేడాది మార్చిలో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి న్యాయం చేయాలంటూ బాధిత మహిళ అర్థించింది. రఘునందన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గత నెల 23న రామచంద్రాపురం పోలీసులను మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఆ తర్వాత ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా సజ్జనార్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. తనపై అత్యాచారం కేసు నమోదు కావడంపై రఘునందన్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగా ప్రభుత్వమే ఈ పని చేస్తోందని ఆరోపించారు.

More Telugu News