Pawan Kalyan: రాపాక ఉన్నాడో? లేడో తెలియదు..: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

  • ఎన్నడూ వ్యక్తిగత లాభం చూడలేదు
  • చూసుకుని ఉంటే జనసేన పెట్టేవాడినే కాదు
  • బీజేపీలో చేరి పదవులు అనుభవించేవాడిని
  • రాపాక ఉన్నాడో, లేడో తెలియదు
  • పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్

జనసేనకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని, అతను కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందిన వారు, ఇప్పుడు తన పద్ధతి బాగాలేదంటూ విమర్శలు గుప్పించి వెళ్లిపోతున్నారని, అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పార్టీ అండగా ఎదగాలని భావించేవారికి తాను అర్థం కానని, అటువంటి వాళ్ల విమర్శలను పట్టించుకోబోనని వ్యాఖ్యానించారు.

ఎవరికీ కాపలా కాస్తూ తాను ఉండలేనని, ఎవరి మోచేతి నీళ్లూ తాగబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు తప్పుమీద తప్పు చేయగా, ఇప్పుడు వైసీపీ సర్కారు నియమించిన గ్రామ వాలంటీర్లు సైతం అదే పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారని ఆరోపిస్తూ, రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గర చేసిన సంక్షేమ పథకాలకు 70 శాతం నిధులను కేంద్రమే ఇస్తోందని, వాటిని మళ్లిస్తున్నారని, దీనిపై త్వరలోనే ప్రజల్లోకి వెళతానని అన్నారు.

తనపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకే తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించానే తప్ప, సినిమాలంటే ఇష్టంతో కాదని, అడ్డదారుల్లో సంపాదించే డబ్బు తనకు అక్కర్లేదని పవన్ వ్యాఖ్యానించారు. అసలు వ్యక్తిగత లాభాన్ని చూసుకుని ఉండుంటే, జనసేన పార్టీ పెట్టుండే వాడిని కాదని, బీజేపీలో చేరివుంటే కోరుకున్న పదవులు లభించి వుండేవని, వాటిని అనుభవిస్తూ ఉండేవాడినని కీలక వ్యాఖ్యలు చేశారు.

More Telugu News