Union Budget 2018-19: ఈ బడ్జెట్ తర్వాత ఎఫ్డీఐలు బాగా వస్తాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నాయి
  • ‘మేకిన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’కు ప్రోత్సాహం పెరుగుతుంది
  • ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి చిన్నచూపు లేదు 

దేశంలో ఉన్న వర్తమాన, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఒక మంచి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనను పలకరించిన మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగం, వ్యక్తిగత పన్నులు చెల్లించే శ్లాబ్ విధానంలో మార్పులకు సంబంధించి, స్టార్టప్స్.. ఇలా అనేక అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ ను రూపొందించారని చెప్పారు. ఈ బడ్జెట్ తర్వాత ఎఫ్డీఐలు బాగా వస్తాయని, ‘మేకిన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’కు ప్రోత్సాహం పెరుగుతుందని, అదేవిధంగా, రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, ‘ఇది రాష్ట్రాల బడ్జెట్ కాదు జాతీయ స్థాయి బడ్జెట్’ అని అన్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి చిన్నచూపు లేదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గురించి కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ, నిధులు ఇవ్వడంలో ఆలస్యమైతే అవచ్చేమో కానీ, ఈ ప్రాజెక్టు ఖర్చుకు వినియోగించే చివరి రూపాయి వరకు కేంద్రమే భరిస్తుందని, ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్ కు కొన్ని నిధులు పెంచామని, నేషనల్ పోలీస్ యూనివర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పారా మిలిటరీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను మరింతగా పెంచబోతున్నాం కనుకనే బడ్జెట్ కొంత పెరిగిందని కిషన్ రెడ్డి వివరించారు.

More Telugu News