Union Budget 2020: అద్భుతమైన బడ్జెట్ అన్న కన్నా... ఏపీని ముంచారన్న సీపీఐ రామకృష్ణ!

  • బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • బీజేపీ నేతల పొగడ్తలు
  • విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్పందనలు వస్తున్నాయి. సహజంగానే విపక్షాలు బడ్జెట్ పై పెదవి విరుస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ తో వ్యవసాయరంగం వేగంగా పురోగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ స్థాయికి చేరడం తథ్యమని జోస్యం చెప్పారు. సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి... ఇలా అన్ని రంగాలకు ఊతమిచ్చే బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు.

ఇక, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీని కేంద్రం మరోసారి మోసం చేసిందని విమర్శించారు. అంకెల గారడీ తప్ప బడ్జెట్ లో ఏమీ లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా ఈ బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ప్రస్తావనే తీసుకురాలేదని పేర్కొన్నారు.

More Telugu News