Uttar Pradesh: యూపీ ఉన్మాది ఘటనలో బాలిక సమయస్ఫూర్తి!

  • కుమార్తె బర్త్ డేకి ఆహ్వానించి పిల్లలను నిర్బంధించిన ఉన్మాది
  • బెదిరింపులకు లొంగకుండా చిన్నారుల ప్రాణాలు కాపాడిన బాలిక
  • పోలీసు కాల్పుల్లో హతమైన ఉన్మాది

ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో సుభాష్ బాథమ్ అనే ఉన్మాది తన ఇంట్లో 20 మందికి పైగా చిన్నారులను నిర్బంధించి ఆపై పోలీసు కాల్పుల్లో హతుడైన విషయం తెలిసిందే. గ్రామస్తుల దాడిలో అతడి భార్య కూడా మరణించింది. ఒక్కో చిన్నారిని వదిలిపెట్టేందుకు ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనలో ఓ బాలిక చూపిన సమయస్ఫూర్తి తాజాగా వెల్లడైంది.

సుభాష్ బాథమ్ తన కుమార్తె బర్త్ డే అని చెప్పి 20 మంది చిన్నారులను ఆహ్వానించి వారందరికీ తినుబండారాలు ఇచ్చి ఆపై బేస్ మెంట్ లో బంధించాడు. తుపాకీతో బెదిరించడంతో ఆ బాలలు హడలిపోయి ఏడుపు లంకించుకున్నారు. ఆ చిన్నారుల్లో అందరికంటే పెద్దదైన 15 ఏళ్ల బాలిక కొద్దిసేపట్లోనే తేరుకుని మిగతా బాలబాలికలను సముదాయిస్తూ ఎంతో నిబ్బరం కనబర్చింది. దాదాపు 9 గంటల పాటు కిడ్నాపర్ చెరలో ఉన్న పిల్లలకు అన్నీ తానే అయింది. ఓ దశలో తన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారన్న కోపంతో పిల్లల్ని చంపేందుకు సుభాష్ బాథమ్ ప్రయత్నించాడు.

ఈ విషయం గ్రహించిన ఆ బాలిక వెంటనే బేస్ మెంట్ తలుపులను లోపలి నుంచి గడియ వేసేసింది. తలుపులు తీయాలంటూ ఆ ఉన్మాది ఎంత రంకెలు వేసినా బాలిక ధైర్యంగా వ్యవహరించింది. చివరికి పోలీసులు వచ్చాకే బేస్ మెంట్ తలుపులు తెరిచింది. ఇప్పుడా బాలికను పోలీసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఆ బాలిక సమయోచితంగా వ్యవహరించబట్టే దుర్మార్గుడు సుభాష్ బాథమ్ పిల్లలను ఏమీ చేయలేకపోయాడని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News