wipro: విప్రో సీఈఓ పదవికి అబిదాలీ నీముచ్ వాలా రాజీనామా!

  • కుటుంబపరమైన కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
  • కొత్త నియామకం జరిగే వరకు పదవిలో కొనసాగింపు 
  • అబిదాలీ సేవలను ప్రశంసించిన అజిమ్ ప్రేమ్ జీ

కుటుంబపరమైన కారణాలతో విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవికి రాజీనామా చేస్తున్నట్లు అబిదాలీ నీముచ్ వాలా ఈ రోజు ప్రకటించారు. తెల్లవారు జామున తన రాజీనామా పత్రాన్ని సంస్థకు పంపినట్లు వెల్లడించారు. ఇన్నేళ్ల తన ప్రయాణంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ, ఆయన కుమారుడు రిషాద్ ప్రేమ్ జీ, కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.

'ఘన చరిత్ర కలిగిన విప్రోకు సేవలందించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కస్టమర్ల వ్యవస్థ ఆధునికీకరణ, డెలివరీ విభాగం అభివృద్ధి విషయంలో మంచి ఫలితాలు సాధించడం ఆనందంగా ఉంది' అంటూ తన లేఖలో అబిదాలీ పేర్కొన్నారు.

డెబ్బయి సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన విప్రోలో చోటుచేసుకున్న ఈ ఘటన మార్కెట్ వర్గాలను కాస్త ఆశ్చర్యపరిచింది. కొత్త సీఈఓ బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

కాగా, సీఈఓ రాజీనామా వ్యవహారంపై చైర్మన్ ప్రేమ్ జీ సానుకూలంగా స్పందించారు. 'మేము మానసికంగా బలపడేందుకు, ముఖ్యమైన సేవలందించేందుకు, మా డిజిటల్ వ్యాపారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు అబిదాలీ చేసిన కృషి మరువలేనిది. విప్రోకు నాయకత్వం వహించినందుకు, సేవలందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు' అని తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News