Mahatma Gandhi: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి.. ప్రముఖుల నివాళి!

  • రాజ్ ఘాట్ వద్ద అంజలి ఘటించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని 
  • మహాత్ముని అడుగుజాడల్లో నడిచేందుకు పునరంకితం అవుదాం: ఏపీ సీఎం జగన్
  • గాంధీ మాటే నాకు ఆదర్శం: చంద్రబాబు

జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ సీఎంతోపాటు ఏపీ విపక్ష నేత చంద్రబాబు గాంధీకి అంజలి ఘటించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు ఈరోజు ఉదయం అంజలి ఘటించారు. గాంధీ సమాధిపై పూలు వుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశం మెచ్చిన గొప్ప నాయకుడు మహాత్ముడని, ఆయన ఆదర్శాల అమలుకు, మహాత్ముని అడుగుజాడల్లో నడిచేందుకు పునరంకితం అవుదామని జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మన కర్తవ్యాన్ని మనం నిజాయతీగా నిర్వహించాలన్న మహాత్మాగాంధీ మాటే తనకు ఆదర్శమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహాత్మునికి నివాళులర్పించిన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడమేకాక, మనిషి మహాపురుషునిగా మారాలంటే ఏం చేయాలో మార్గనిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి గాంధీ అని పేర్కొన్నారు. 

More Telugu News