Karnataka: ఐఏఎస్ కు అడుగు దూరం.. బస్ కండక్టర్ ఆదర్శ ప్రయాణం!

  • సివిల్స్ ఇంటర్వ్యూకు చేరిన కర్ణాటక చిరుద్యోగి
  • మార్చి 25న జరగనున్న మౌఖిక పరీక్ష 
  • ఐఏఎస్ సాధిస్తానని నమ్మకంగా చెబుతున్న అభ్యర్థి

'ఉత్సాహం ధైర్యం బుద్ధిశ్శక్తి పరాక్రమం...షడతే యత్ర తిష్టంతి తత్ర దేవో పి తిష్టతి' అన్న పెద్దల మాటను అక్షరాలా నిజమని నిరూపిస్తున్నాడీ కండక్టర్. ఓ వైపు కండక్టర్ ఉద్యోగం చేస్తూ మరోవైపు దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్ లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూ వరకు చేరుకున్న ఈ యువకుడు ఈసారి కచ్చితంగా సర్వీస్ సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు.

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా మళవల్లికి చెందిన ఎన్.సి.మధు బెంగళూరు మహానగరం కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్. కుటుంబ అవసరాల కోసం 19వ ఏటే కండక్టర్ ఉద్యోగంలో చేరాడు. చదువంటే ఎంతో ఇష్టం కావడంతో దూరవిద్యలోనే డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. కలెక్టర్ కావాలన్నది అతని లక్ష్యం. ఇందుకోసం మూడేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడు. 2017లో కేఏఎస్ (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్), 2018లో సివిల్స్ రాశాడు. అనుకున్న ఫలితం రాలేదు.

అయినా నిరాశ చెందకుండా గత ఏడాది సివిల్స్ కు హాజరయ్యాడు. మెయిన్ కూడా పాసై ఇంటర్వ్యూకు అర్హత సాధించాడు. కన్నడ మాధ్యమంలోనే పరీక్ష రాసిన తాను ఎటువంటి శిక్షణ తీసుకోలేదని, కేవలం య్యూట్యూబ్ లోని సివిల్స్ సైట్ ల ద్వారా రోజుకు ఐదు గంటలపాటు సాధన చేసినట్టు తెలిపాడు.

'ఐఏఎస్ కావాలన్నది నా కల. మార్చి 25వ తేదీన ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూలో పాసైతే సర్వీస్ వస్తుందని ఆశిస్తున్నాను' అని నమ్మకంగా చెబుతున్నాడు మధు. అతని ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.

More Telugu News