Telugudesam: సీఎం జగన్ నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ధ్వంసమయ్యే పరిస్థితి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడతాం
  • మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి
  • రాష్ట్రంలో ఒక విజన్ తో ముందుకు వెళ్లడం లేదు

సీఎం జగన్ అప్రజాస్వామిక నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ధ్వంసమయ్యే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, ప్రతిపక్షంగా బాధ్యత వహించి మండలిలో తాము పోరాడామని అన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఎవరూ అడ్డులేకుండా ఉండాలని భావించి, ప్రజాస్వామ్యాన్ని కూడా లెక్క చేయకుండా శాసనమండలి రద్దు తీర్మానం పెట్టారని విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి సరైన మార్గంలో ముందుకు వెళతామని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ నినాదమని, దానికి కట్టుబడి టీడీపీ హయాంలో ముందుకు నడిచామని చెప్పారు. ఈ రోజు పరిస్థితి చూస్తే, రాష్ట్రాన్ని ముక్కలుముక్కలుగా విడగొట్టేలా, ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి చిచ్చు పెట్టేలా, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేలా వైసీపీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఒక విజన్ తో ముందుకు వెళ్లడం లేదని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

More Telugu News