Telugudesam: ‘నా మనసు బాధించింది.. రాత్రి నిద్రపట్టలేదు’ అని మండలిని రద్దు చేస్తానంటే ఎలా?: జగన్ పై కనకమేడల సెటైర్లు

  • సెలెక్ట్ కమిటీకి పంపించారని రద్దు చేస్తామంటారా?
  • ఇది హేతుబద్ధమైన వాదన కాదు
  • సహేతుకమైన కారణాలు చెప్పాలి: కనకమేడల డిమాండ్

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం చేయడంపై వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తప్పుబట్టారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన కారణాలు చూపించకుండా, ‘నా మనసు బాధించింది.. రాత్రి నాకు నిద్ర పట్టలేదు’ అని చెప్పి మండలిని రద్దు చేయాలని ఎవరైనా చూస్తారా? అంటూ జగన్ పై మండిపడ్డారు.

రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు కనుక మండలిని రద్దు చేస్తామనడం కరెక్టు కాదని, అది హేతుబద్ధమైన వాదన కాదని, సహేతుకమైన కారణాలు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్ణయాలు చట్టసభల స్క్రూట్నీలో, న్యాయ సమీక్షకు నిలవవని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీలందరూ ఇంటికి వెళ్లిపోండని ఒక పక్కన చెబుతారని, మరోపక్క ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులైన వాళ్లేమో తమ విధులు నిర్వహిస్తున్నారని, ఆ మంత్రులు ఇద్దరూ బీసీలే అని అన్నారు. మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చ అంతా చంద్రబాబును తిట్టడం తప్ప మరోటి లేదని విమర్శించారు.

‘మండలి’ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రత్యేక వ్యవస్థ అని అన్నారు. మండలి రద్దు చేయడమనేది ముఖ్యమంత్రి ఇంట్లో సొంత వ్యవహారమా? ఆయన కుటుంబ సమస్యా? రాష్ట్రానికి సంబంధించిన సమస్యా? అని కనకమేడల ప్రశ్నించారు. 'రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి మండలి చైర్మన్ పంపడం రాజ్యాంగ ఉల్లంఘనట, ఈ విషయం జగన్ మనసును బాధించిందట, నియంతలకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండవు' అంటూ విమర్శలు చేశారు.

మండలి రద్దుకు తీర్మానం చేసిన ప్రక్రియలో రాజకీయపరమైన కుట్ర ఉందని ఆరోపించారు. శాసనమండలి రద్దు తీర్మానం చేయడం ద్వారా బీసీల వ్యతిరేకి అని జగన్ మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు.

More Telugu News