CAA: మా అంతర్గత వ్యవహారంపై మీ తీర్మానం ఏమిటి?: ఈయూ తీరుపై మండిపడిన భారత్

  • సీఏఏ చట్టంపై చర్చించాలనుకోవడాన్ని తప్పుబట్టిన ఇండియా 
  • చట్టబద్ధమైన అంశంపై ఇది తప్పుడు నిర్ణయం 
  • చట్టంపై చర్చించాలన్నవారు ముందు భారత్ తో సంప్రదించాల్సింది

యూరోపియన్ యూనియన్ తీరుపై భారత్ మండిపడింది. పౌరసత్వ సవరణ చట్టంపై ఐరోపా సమాఖ్యలో చర్చించాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. 'ఇది మా అంతర్గత వ్యవహారం. పైగా ప్రజాప్రాతినిధ్య సభలు మెజార్టీ నిర్ణయంతో ఆమోదించి చేసిన చట్టం ఇది. అటువంటి చట్టంపై మీ సభలో చర్చించాలనుకోవడం ఏం తీరు?' అంటూ ప్రశ్నించింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ యూరోపియన్ యూనియన్లోని కొందరు సభ్యులు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాలపై బుధవారం చర్చించాలని సభ నిర్ణయంచింది. తర్వాత రోజు ఈ తీర్మానాలపై ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

'సీఏఏ చట్టం వివక్షాపూరితంగా ఉంది. దీనిపై ఆందోళన చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరపాలి' అంటూ సభ్యులు ఆ తీర్మానాల్లో పేర్కొన్నారు. దీన్ని తప్పుపడుతూ తన అసంతృప్తిని భారత్ యూరోపియన్ యూనియన్‌కు తెలియజేసింది.

తీర్మానాలు ప్రవేశ పెట్టిన సభ్యులు ముందు భారత్ తో సంప్రదింపులు జరపాలని హితవు పలికింది. ఇది ఏ వర్గం పైనా వివక్ష చూపదని, సీఏఏ చట్టం వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం రద్దుకాదని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా దేశంలో ఆందోళనలు ఆగడం లేదు.

More Telugu News