సీఎం జగన్ కు కోర్టుల పట్ల గౌరవం లేదు: టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శ
- అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టు విచారణను ఎదుర్కోవాలి
- జగన్ తన ఆస్తుల వివరాలు వెల్లడించాలి
- లోటస్ పాండ్ ఎవరిదో చెప్పాలి
2012లో జగన్ పై సీబీఐ 11 చార్జీషీట్లు నమోదు చేయగా, అనంతరం ఈడీ 5 చార్జీషీట్లు వేసిందని వర్ల అన్నారు. 2014 మార్చి 10న సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరిస్తూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణను సంవత్సరంలో పూర్తి చేయాలని పేర్కొన్న విషయాన్ని వర్ల ఈ సందర్భంగా ఉటంకించారు. మిగతా కేసుల్లో ఈ ఆదేశాలు అమలవుతున్నాయి, కానీ జగన్ పై కేసులు ఇన్నేళ్లుగా ఎందుకు సాగుతున్నాయో తెలియటం లేదన్నారు. సీబీఐ కోర్టుపై తమకు గౌరవముందంటూ.. జగన్ పై కేసుల విచారణలో ఆలస్యం జరగటంపై ప్రశ్నించారు. రాజకీయ నాయకులపై కేసులను సంవత్సరంలోగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి మోదీ కూడా చెప్పారన్నారు.