MLC: తప్పు ఒప్పుకొని సరిదిద్దుకుంటే.. మండలిని కొనసాగించే అవకాశం: ఎమ్మెల్సీ సునీత

  • వికేంద్రీకరణ బిల్లుపై మండలి ఛైర్మన్ వైఖరి సరికాదు 
  • ఆయన నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా ఉంది
  • ప్రజలకు మేలు చేయాలనే సీఎం జగన్ ఈ బిల్లును తెచ్చారు

ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలి ఛైర్మన్ అనుసరించిన వైఖరి సరికాదని, ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా ఉందని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. ఈ విషయాన్ని విస్మరించి టీడీపీ బిల్లును అడ్డుకుందన్నారు.

తప్పును సరిదిద్దుకుంటే శాసన మండలిని సీఎం జగన్ కొనసాగించే అవకాశముందని ఈ సందర్భంగా సునీత వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా శాసన మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే. మండలి నిర్వహణకు ఏడాదికి రూ.60 కోట్లు వృథా అవుతున్నాయంటూ ప్రభుత్వం పేర్కొంటోంది.

More Telugu News