Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం తాజా ఆదేశాలు

  • సుప్రీంను ఆశ్రయించిన డిస్కంలు, ఉద్యోగులు
  • అభ్యంతరాలను మరోసారి పరిశీలించాలన్న సుప్రీంకోర్టు
  • జస్టిస్ ధర్మాధికారి కమిటీకి స్పష్టీకరణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ ఉద్యోగుల విభజన జరగలేదు. ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఏపీ డిస్కంలు, విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం... ఉద్యోగుల ఫిర్యాదులు, డిస్కంల అభ్యంతరాలను మరోసారి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీని ఆదేశించింది.

కమిటీ సిఫారసులలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల కేటాయింపులపై డిస్కంలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ధర్మాధికారి కమిటీకి తెలియజేయాలని సూచించింది అంతేకాకుండా, రిలీవ్ అయిన ఏపీ ఉద్యోగులకు ఎవరు జీతాలు చెల్లించాలన్న అంశంపై కమిటీనే నిర్ణయించాలని పేర్కొంది. కాగా, తమకు 600 మందిని అదనంగా కేటాయించారని, ఇది తమకు ఎంతో భారమని విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించగా, నియమ నిబంధనలకు లోబడి ఈ అంశాన్ని పరిష్కరించాలని ధర్మాధికారి కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది.

More Telugu News