JP Nadda: దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ

  • ఢిల్లీలో బిజీబిజీగా పవన్ కల్యాణ్
  • నిన్న నిర్మలా సీతారామన్ తో భేటీ
  • ఈరోజు జేపీ నడ్డా నివాసానికి వెళ్లిన జనసేనాని

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఆయన తన కార్యాచరణను ముమ్మరం చేశారు. బీజేపీతో చేతులు కలిపిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అమరావతే శాశ్వత రాజధాని అని... దీనిపై అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అద్భుతాలు జరగబోతాయంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో, బీజేపీతో కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో నిన్న దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితర నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ కోరుకుంటున్న రాజధాని విశాఖలో రిపబ్లిక్ డే పరేడ్ ను కూడా నిర్వహించలేకపోతున్నారని... అమరావతి సంగతి కూడా ఇంతేనని ఎద్దేవా చేశారు.

తన ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న పవన్ కల్యాణ్ కాసేపటి క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నడ్డా నివాసానికి వెళ్లిన పవన్... బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన పలు విషయాలపై నడ్డా, పవన్ చర్చిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో కూడా పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News