IRCTC: గంటన్నర ఆలస్యమైన రైలు... ప్రయాణికులకు పరిహారం చెల్లించనున్న ఐఆర్సీటీసీ!

  • అహ్మదాబాద్, ముంబై మధ్య తేజస్ రైలు
  • ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం
  • నిన్న ఆలస్యమైన రైలు... ప్రయాణికులకు పరిహారం

తాము ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన తేజస్ ఎక్స్ ప్రెస్, నిర్ణీత సమయం కన్నా గంట ఆలస్యంగా గమ్యాన్ని చేరడంతో ఐఆర్సీటీసీ మొత్తం రూ. 63 వేల పరిహారాన్ని ప్రయాణికులకు చెల్లించనుంది. అహ్మదాబాద్, ముంబై మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇటీవల ఐఆర్సీటీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారాన్ని ఇవ్వాల్సివుంటుంది.

దేశంలోని రెండో ప్రైవేటు ఎక్స్ ప్రెస్ రైలుగా ఇది ఈ నెల 19 నుంచి సేలను ఆరంభించింది. కాగా, మంగళవారం బయలుదేరిన రైలు గంటన్నర ఆలస్యంగా గమ్యానికి చేరుకుంది. దీంతో ప్రయాణికులకు చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించామని, రైలు జాప్యంపై దరఖాస్తు చేసే రిజర్వేషన్ ప్రయాణికులకు రిఫండ్ లభిస్తుందని అధికారులు తెలిపారు.

అహ్మదాబాద్ లో ఉదయం 6.42 గంటలకు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు ముంబై చేరుకోవాల్సి వుండగా, ముంబై శివారులోని దహిసర్ - భయందర్ స్టేషన్ల మధ్య టెక్నికల్ ఫాల్ట్ ఏర్పడటంతో 2.36 గంటలకు చేరింది. దీంతో తమ పాలసీ ప్రకారం, గంట ఆలస్యానికి రూ. 100, రెండు గంటల ఆలస్యానికి రూ. 250 చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.

More Telugu News