Narendra Modi: ఆర్థిక మంత్రిపై అంత అసంతృప్తి ఎందుకు.. రాజీనామా చేయమనొచ్చుగా?: ప్రధానికి కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ సూచన

  • పారిశ్రామికవేత్తలతో మోదీ ముందస్తు బడ్జెట్ సమావేశాలు
  • ఏ ఒక్క దానికీ మంత్రిని ఆహ్వానించలేదు
  • ఆర్థిక శాఖను మోదీ భ్రష్టుపట్టిస్తున్నారు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పనితీరుపై ప్రధాని మోదీ అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంవో) నిర్వహించారని, ఈ సమావేశాలకు మంత్రి నిర్మలను ఆహ్వానించలేదని ఆరోపించారు. ఆమె పనితీరు పట్ల మోదీ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆమెను ఆహ్వానించలేదన్న సంగతి అర్థమవుతోందన్నారు.

మంత్రి పనితీరుపై అంత అసంతృప్తి ఉన్నప్పుడు ఆమెను రాజీనామా చేయమని చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ 13 ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించారని పృథ్వీరాజ్ అన్నారు. వీటిలో ఏ ఒక్క సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలను ఆహ్వానించకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఆమె పనితీరుపై ప్రధాని అసంతృప్తిగా ఉంటే రాజీనామా చేయమని చెప్పాలి తప్పితే, ఆర్థిక శాఖను భ్రష్టు పట్టించడం సరికాదని చవాన్ హితవు పలికారు.

More Telugu News