Somu Veerraju: ఏపీలోని పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందాలి: 'మండలి'లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

  • పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చ
  • ‘అధికారం’ కాదు ‘అభివృద్ధి’ అనేది శాశ్వతం
  • బాబు నాడు మోదీ బొమ్మను గాడిదతో తన్నించారు

రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది తమ అభిప్రాయమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో అయినా రాజధానిని ఆధారంగా చేసుకుని అభివృద్ధి జరగడాన్ని గమనించామా? అని ప్రశ్నించారు. క్యాపిటల్ గురించి ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంటూ అప్పుడు, ‘క్యాపిటల్’ అంటూ ఇప్పుడూ కేంద్రంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేయడం తగదని అన్నారు. ‘అధికారం’ కాదు ‘అభివృద్ధి’ అనేది శాశ్వతం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 

ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డుల అంశం ఉందని, బందరు పోర్టు నిర్మాణాన్ని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, విభజన తర్వాత కూడా అదే పద్ధతిలో చంద్రబాబు ముందుకెళ్లారని, అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. నాడు ప్రధాని మోదీ బొమ్మను గాడిదతో తన్నించిన చంద్రబాబు, ఇప్పుడు రాజధాని విషయంలో ఆయన జోక్యం కోరుతున్నారని విమర్శించారు.

More Telugu News