CAA: పౌరసత్వ సవరణ చట్టంపై అభ్యంతరాలను పరిశీలించనున్న సుప్రీంకోర్టు

  • చట్టాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 143 పిటిషన్లు 
  • విచారించనున్న చీఫ్ జస్టితో కూడిన ధర్మాసనం 
  • పిటిషన్లపై ఇప్పటికే సుప్రీం నోటీసులు జారీ

పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు పరిశీలించనుంది. భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు చేసి ఆమోదించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలే చేయమని భీష్మించుకు కూర్చున్నాయి. 

ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఇప్పటి వరకు ఎపెక్స్ కోర్టులో 143 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నేత జైరాంరమేష్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, కేరళ ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి.

చట్టం రాజ్యాంగ చెల్లుబాటును వీరు ప్రశ్నిస్తూ తక్షణమే అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను కూడా ఎపెక్స్ కోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్లు అన్నింటి పైనా చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభిస్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

More Telugu News