Amaravati: మండలిలో నెగ్గిన టీడీపీ పంతం... ప్రస్తుతానికి ఆగిన రాజధాని బిల్లు!

  • రూల్ 71 కింద నోటీసు ఇచ్చిన టీడీపీ
  • నోటీసుపై చర్చకు అనుమతించిన మండలి చైర్మన్
  • శాసన మండలిలో టీడీపీకి అధిక సభ్యులు

తమ పార్టీకి బలమున్న ఏపీ శాసనమండలిలో, చెప్పినట్టుగానే మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. ఈ ఉదయం పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టగానే, టీడీపీ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, రూల్ నంబర్ 71 కింద నోటీసులు ఇచ్చింది. బిల్లును ప్రవేశపెట్టేముందు తామిచ్చిన నోటీసుపై చర్చించాలని టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో ఆమోదం పొందినందున వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరపాల్సిందేనని, రూల్ 71 పేరు చెప్పి, బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని బుగ్గన స్పష్టం చేశారు. దీనిపై నిబంధనలను పరిశీలించిన మండలి చైర్మన్, రూల్ 71ను పరిగణనలోకి తీసుకుని టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని, చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో ఈ బిల్లుకు ప్రస్తుతానికి అడ్డుకట్ట పడినట్టే. ఒకవేళ ఇక్కడ బిల్లు వీగిపోతే, డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద అధికార పక్షం, దీన్ని ఆమోదింపజేసుకునే వీలుంటుంది.

కాగా, ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో సభ్యుల సంఖ్య 58 కాగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు పాస్ కావడానికి 28 మంది సభ్యుల బలం అవసరం. టీడీపీకి 34 మంది సభ్యుల బలం ఉండటం వారికి కలిసొచ్చే అంశం. వైసీపీకి మండలిలో 9 మంది పీడీఎఫ్ తరఫున ఆరుగురు, బీజేపీ తరఫున ఇద్దరు, స్వతంత్రులు ముగ్గురు, కాంగ్రెస్ తరఫున ఒక్కరు ఉండగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

More Telugu News