Velagapudi: వెలగపూడిలో అరాచక శక్తులు... భారీ ఎత్తున పోలీసుల సెర్చ్ ఆపరేషన్!

  • పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం
  • గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్న పోలీసులు
  • ర్యాలీలను అనుమతించబోమని స్పష్టీకరణ

గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉన్న ఏపీ సచివాలయం పరిసర ప్రాంతాలతో పాటు, అమరావతి పరిధిలోని గ్రామాల్లోకి అరాచక శక్తులు ప్రవేశించాయని పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో, ఈ ఉదయం నుంచి భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. పోలీసులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని, ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని, 29 గ్రామాల్లో పోలీసులు మైకుల్లో ప్రచారం చేస్తున్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, అటువంటి పనులు చేస్తే, కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరికీ ఆశ్రయం కల్పించవద్దని స్థానికులకు సూచిస్తున్న పోలీసులు, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదిలావుండగా, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఉన్నతాధికారులు, ఇప్పటికే అసెంబ్లీకి దారితీసే అన్ని రోడ్లనూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా నిరసనలు తెలియజేయాలని భావిస్తే, శాంతియుతంగా చేసుకోవచ్చని, ర్యాలీలకు మాత్రం అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News