'ఆర్ఆర్ఆర్' సినిమాలో తాను నటిస్తున్నానని వస్తోన్న వార్తలపై స్పష్టతనిచ్చిన కిచ్చా సుదీప్

19-01-2020 Sun 12:14
  • ఆ సినిమాలో నేను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం
  • ఇప్పటివరకు నన్ను ఆ సినిమా బృందం సంప్రదించలేదు
  • ట్వీట్ చేసిన సుదీప్ 

టాలీవుడ్‌ స్టార్ హీరోలు జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు.  'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నేను నటిస్తున్నానంటూ గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం. ఇప్పటివరకు నన్ను ఆ సినిమా బృందం సంప్రదించలేదు' అని సుదీప్ ట్వీట్‌ చేశారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాల్లో సుదీప్ నటించిన విషయం తెలిసిందే.

బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో అసలు సిసలైన మల్లీస్టారర్ సినిమా వస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్ నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 20న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.