పబ్జీకి బానిసై గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు

19-01-2020 Sun 11:34
  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • రెండేళ్లుగా పబ్జీ ఆడుతున్న హర్షల్‌ (27)
  • ఇటీవల గుండెపోటు
  • ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో మృతి

ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీకి బానిసై మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిరంతరం పబ్జీ ఆటే ఆడుతుండడంతో అనారోగ్యపాలు కావడంతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, హర్షల్‌ (27) రెండేళ్లుగా పబ్జీ ఆడుతున్నాడు. ఇతర ఏ పనీ చేయకుండా అదే పనిగా పబ్జీ ఆడుతుండడంతో ఇటీవల గుండెనొప్పి వచ్చింది.

దీంతో హర్షల్‌ను అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుతో పాటు అతడికి ఒకేసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌ కూడా వచ్చిందని వైద్యులు చెప్పారు. హర్షల్ మెదడులోని కణజాలం చిట్లి తీవ్ర రక్తస్రావం అయిందని చెప్పారు. దీంతో ఈ రోజు ఉదయం హర్షల్‌ మృతి చెందాడని తెలిపారు.