ముద్రగడతో భేటీ అయిన బీజేపీ నేత

19-01-2020 Sun 09:01
  • ఏపీలో దూకుడు పెంచుతున్న బీజేపీ
  • పార్టీ బలోపేతం దిశగా అడుగులు
  • రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న ముద్రగడ, సోము వీర్రాజుల భేటీ

ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే జనసేనతో చేతులు కలిపి పార్టీ బలోపేతానికి ముందడుగు వేసింది. కాపు సామాజికవర్గానికి చేరువ కావడానికి అడుగులు వేస్తోంది. తాజాగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ, జనసేనల పొత్తు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు లోతుగా చర్చలు జరినట్టు సమాచారం. కాపు నేతగా కోస్తాంధ్రలో ముద్రగడకు మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో, ఆయన బీజేపీలో చేరితే పార్టీకి మరింత బలం పెరుగుతుందనే యోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ముద్రగడ, సోము వీర్రాజుల భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.