Fastag: ఫాస్టాగ్ ఉంటేనే తిరుగు ప్రయాణంలో టోల్ రాయితీ!

  • వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ 
  • సాధారణ చెల్లింపులకు రాయితీ వర్తించదని స్పష్టీకరణ 
  • నెలవారీ పాసులు, ఇతర రాయితీలకు ఇదే నిబంధన

టోల్ గేట్ల మీదుగా ప్రయాణించే వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. తిరుగు ప్రయాణంలో వాహన చోదకులకు ఇస్తున్న యాభై శాతం రాయితీని ఫాస్టాగ్ చెల్లింపులకు తప్ప సాధారణ చెల్లింపుదారులకు వర్తించదని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల టోల్ చెల్లింపులకు ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసి వంద శాతం వాహనాలను ఫాస్టాగ్ పరిధిలోకి తెచ్చేందుకు తాజా నిబంధన విధించింది.

సాధారణంగా కార్లు, ఇతర ఫోర్ వీలర్ వాహనాలు ఓ వైపు వెళ్తూ ఇరవై నాలుగు గంటల్లోగా తిరిగి వచ్చేస్తామని భావిస్తే రెండు వైపులా ఒకేసారి టోల్ ఫీజు చెల్లించవచ్చు. ఇలా చెల్లిస్తే రిటర్న్ టోల్ లో యాభై శాతం ఫీజు రాయితీని ఇప్పటి వరకు ఇస్తున్నారు.

ఫాస్టాగ్ చెల్లింపులు చేయని వారికి ఇకపై ఈ రాయితీ వర్తించదు. అలాగే, నెలవారీ పాసులు, ఇతర రాయితీ పాసుల వారు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ పరిధిలోకి రావాలి. లేదంటే వారికీ ఈ యాభై శాతం రాయితీని వర్తింపజేయరు.

More Telugu News