Andhra Pradesh: ప్రత్యేకహోదా గురించి వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

  • విజయవాడలో జనసేన, బీజేపీ సమావేశం
  • మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్
  • తమకంటే వైసీపీ, టీడీపీ వాళ్లనే ఎక్కువగా అడగాలని సూచన

ఏపీలో కొత్త పొత్తు పొడిచింది. రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నిదర్శనంగా బీజేపీ, జనసేన కూటమి ఏర్పడింది. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం బీజేపీ, జనసేన అగ్రనేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అప్పట్లో బీజేపీకి దూరమయ్యామని వివరించారు.

"ఏపీ అభివృద్ధికి దోహదపడేందుకే మొదట్లో బీజేపీతో చెలిమి చేశాం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. గత రెండుమూడు నెలలుగా బీజేపీ కీలక నేతలతో లోతుగా చర్చలు జరిపి, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో గుర్తించాం. ఇకపై ఆ అంతరాలు ఉండవు. ఏపీ ప్రజల భవిష్యత్ కోసం అంతరాలన్నీ పక్కనబెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వారు ఆమోదం తెలిపిన తర్వాత బీజేపీతో సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. మెజారిటీ ఉంది కదా అని వైసీపీ ప్రభుత్వం ఇష్టంవచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడ తెగించే నాయకత్వం ఉంది" అంటూ స్పష్టం చేశారు.

ఇక, ప్రత్యేక హోదా విషయంపైనా అభిప్రాయాలు వెల్లడించారు. "నన్ను అడగడం కంటే తెలుగుదేశం పార్టీని ఎక్కువగా అడగాలి. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించింది వాళ్లే. 20కి పైగా ఎంపీలున్న వైసీపీ వాళ్లను సైతం అడగాలి. హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడడంలేదు ఎందుకనని వైసీపీ వాళ్లను నిలదీయాలి. ముగ్గురు ఎంపీలున్న టీడీపీని ప్రశ్నించండి. హోదా కోసం మేం చేయాల్సిన పోరాటాలన్నీ చేశాం. నిలబడాల్సినంత మేర నిలబడ్డాం. ఏపీ అభివృద్ధికి ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారు. ఏపీలో కులతత్వం పోతేనే అభివృద్ధి సాకారమవుతుంది" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

More Telugu News