Twitter: 'ఇదేంటీ? ఆకాశం నుంచి నీళ్లు వస్తున్నాయి?'.. తొలిసారి వర్షాన్ని చూసి సంబరపడ్డ చిన్నారి.. వీడియో వైరల్

  • ఆస్ట్రేలియాలో ఘటన
  • వీడియో షేర్ చేసిన ఐఆర్ఎస్‌ అధికారి
  • కార్చిచ్చుతో ఇటీవల ఆస్ట్రేలియాలో అడవులు నాశనం
  • భారీ వర్షాలతో ప్రజల్లో ఆనందం 

'ఇదేంటీ? ఆకాశం నుంచి నీళ్లు వస్తున్నాయి?' అంటూ మొట్టమొదటి సారిగా వర్షాన్ని చూసిన ఓ చిన్నారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, వర్షంలో తడుస్తూ సంబరపడి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణం భారీగా నాశనమవుతోన్న విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో మొదలైన కార్చిచ్చు అడవులను దహించి వేస్తోంది. లక్షలాది జంతువులు చనిపోయాయి.  

ఇటీవల అగ్నికీలలకు తగులబడిపోయిన కొన్ని ప్రాంతాల్లో తాజాగా వర్షం పడడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 18 నెలల సన్నీ మకెజీన్ అనే చిన్నారి వర్షంలోకి పరుగులు తీసి, అటూ ఇటూ తిరుగుతూ సంబరంలో మునిగితేలిపోయాడు. అతడు మొట్టమొదటిసారి వర్షాన్ని చూశాడు.

న్యూ సౌత్ వేల్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ తోటలో ఆ చిన్నారి వర్షంలో తడుస్తూ డ్యాన్స్ వేస్తుండగా తీసిన వీడియోను అతడి తల్లి టిఫ్ఫానీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు.

కార్చిచ్చుతో తగలబడి పోతోన్న ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు ఆనందం నింపుతున్నాయని, 18 నెలల ఓ బాలుడు మొట్టమొదటిసారి వర్షాన్ని చూసి, ఆశ్చర్యపోయాడని  సుశాంత నంద తెలిపారు. ఆ పిల్లాడి సంబరానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో ఇళ్లు నాశనమయ్యాయి.. వాతావరణంలో కాలుష్య స్థాయి విపరీతంగా పెరిగిపోయింది.

More Telugu News