Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది: మహిళా కమిషన్ ఆగ్రహం

  • జనవరి 22న ఉరికి డెత్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం
  • రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన దోషి ముఖేశ్ సింగ్
  • ఢిల్లీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ అసంతృప్తి

నిర్భయ దోషుల ఉరి అమలుపై జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ నలుగురు దోషులను కోర్టు నిర్ణయించిన విధంగా జనవరి 22నే ఉరితీయాలని కోరారు. దోషులకు కోర్టు డెత్ వారెంట్ జారీచేసినా, అమలు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, రకరకాల కారణాలు చూపుతూ జాప్యం చేస్తోందని రేఖా శర్మ మండిపడ్డారు. ఢిల్లీ సర్కారు కోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

అటు, నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ, దోషి ముఖేశ్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. దోషులు తప్పించుకోలేరని, వారు ఏ న్యాయస్థానానికి వెళ్లినా జనవరి 22న ఉరి అమలు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సుప్రీం కోర్టు క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. అంతేకాదు, రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరి అమలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కారణంగానే ఢిల్లీ ప్రభుత్వం జనవరి 22న ఉరి అమలుపై నిస్సహాయత వ్యక్తం చేస్తోంది.

More Telugu News