Ranga Reddy District: శంషాబాద్ లో విషాదం.. చాటింగ్ చేస్తూ బిల్డింగ్ పైనుంచి పడి యువతి మృతి!

  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘటన
  • ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడ్డ యువతి
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉద్యోగిగా గుర్తింపు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. భవనం పైనుంచి పడి ఓ యువతి మృతి చెందింది. తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయింది. ఆ యువతి శంషాబాద్ ఎయిర్ పోర్టులోని కస్టమర్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. శంషాబాద్ లోని ఓ మూడంతస్తుల భవనంలో ఆమె అద్దెకు ఉంటోంది. ఈరోజు సాయంత్రం భవనం పైకి వెళ్లిన ఆమె..తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్న ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భవనం పైనుంచి కిందపడి మృతి చెందిన ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతురాలి పేరు సిమ్రన్ అని, కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా ముథోల్ టౌన్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సిమ్రన్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Ranga Reddy District
Shamshabad
woman
chating

More Telugu News