Jublihills: జూబ్లీహిల్స్ పబ్ లో రేవ్ పార్టీ కేసు.. డాక్టర్లు, ప్రమోటర్లకు ఓ ఫార్మా కంపెనీ వల?

  • జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 పబ్ లో నిన్న రేవ్ పార్టీ
  • తమ సేల్స్ పెంచుకోవాలనుకున్న ఓ ఫార్మా కంపెనీ
  • ఈ కేసులో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు

నిన్న రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి, అమ్మాయిలు సహా కొంత మందిని అదుపులోకి తీసుకున్న ఘటన కలకలకం రేపుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ తమ సేల్స్ పెంచుకునేందుకే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. డాక్టర్లు, ప్రమోటర్లను ఆకట్టుకునేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారని, వ్యభిచారం కూడా చేయించారని తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ పబ్ పై నిన్న రాత్రి వెస్ట్ జోన్ పోలీసులు దాడి చేసి 22 మంది అమ్మాయిలను, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. సదరు ఫార్మా కంపెనీ పేరిటే ఈ పబ్ ను బుక్ చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ప్రసాద్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అదుపులో ఉన్న అమ్మాయిల్లో చాలా మంది సినిమాల్లో అవకాశాల కోసం వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News