Visakhapatnam District: మీ తల్లి విజయమ్మను అందుకే ఓడించారు.. ముందు నా సవాలును స్వీకరించండి: జగన్‌కు బీజేపీ నేత కాశీవిశ్వనాథరాజు లేఖ

  • విశాఖను రాజధాని చేయాలంటే ముందు భీమిలి నుంచి పోటీ చేసి గెలవాలి
  •  నగరం ప్రశాంతంగా ఉంది.. కొత్త భయాలు సృష్టించొద్దు
  • నా భూముల విలువ పెరగడం కంటే ప్రజాభీష్టమే ముఖ్యం

ఏపీ రాజధాని విషయంలో జరుగుతున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కాశీవిశ్వనాథరాజు లేఖ రాశారు. విశాఖపట్టణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, రాజధాని కనుక ఏర్పడితే సెటిల్‌మెంట్ గ్యాంగులు, కబ్జాలు, భూతగాదాలు ఎక్కువ అవుతాయని ఇక్కడి స్థానికులు భయపడుతున్నారని పేర్కొన్నారు.

విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే తొలుత భీమిలి స్థానం నుంచి పోటీ చేసి గెలవాలని, అప్పుడు భీమిలి వాసుల అంతరంగం ఏమిటో తెలుస్తుందని అన్నారు. అలాగే, విశాఖ వాసుల అనుమానాలను నివృత్తి చేశాకే రాజధాని ఏర్పాటు నిర్ణయం తీసుకోవాలని కోరారు. తన  సవాలును స్వీకరించి భీమిలి నుంచి గెలిస్తే విశాఖ వాసులందరూ మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అర్థమని పేర్కొన్నారు.

తన ఆస్తులన్నీ విశాఖలోనే ఉన్నాయని, ఇక్కడికి రాజధాని వస్తే తన భూముల విలువ పెరుగుతుందని లేఖలో పేర్కొన్న కాశీవిశ్వనాథరాజు.. అయితే, తన ఆస్తుల విలువ పెరగడం కంటే ప్రజాభీష్టమే ముఖ్యమని, ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు, సెటిల్‌మెంట్లకు భయపడే వైఎస్ విజయలక్ష్మిని విశాఖ వాసులు లక్ష ఓట్ల తేడాతో ఓడించారని ఈ సందర్భంగా కాశీవిశ్వనాథరాజు గుర్తు చేశారు. విశాఖను సినీ, పర్యాటక, ఆర్థిక, ఫార్మా రంగాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, అది మానేసి విశాఖ వాసుల్లో కొత్త భయాలు సృష్టించవద్దని లేఖలో పేర్కొన్నారు.

More Telugu News