టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో బీజేపీ ఉంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

12-01-2020 Sun 15:30
  • మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి బీజేపీకి అభ్యర్థులే లేరు
  • రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీది ఇదే పరిస్థితి
  • కేంద్రంతో ఒక్క హామీ అయినా ఇప్పించే సత్తా టీ- బీజేపీ నేతలకు ఉందా?

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు దక్కని టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో బీజేపీ ఉందంటూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సెంటిమెంట్ తో ఆ పార్టీ ఓట్లు సంపాదించుకుందని అన్నారు. రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీది ఇదే పరిస్థితి అని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒక్క హామీ అయినా ఇప్పించే సత్తా తెలంగాణ బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్లో కుల, మతాల చిచ్చుపెట్టి లాభ పడాలనుకుంటున్న బీజేపీకి ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.