సంక్రాంతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం: రాజధానిపై చంద్రబాబు భార్య భువనేశ్వరి వ్యాఖ్యలు

12-01-2020 Sun 14:00
  • రైతులు బాధల్లో ఉన్నారు
  • రాజధాని అమరావతి రైతులకు ప్రజలంతా అండగా ఉండాలి
  • పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వారు భూములిచ్చారు

అమరావతి రైతుల పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి స్పందించారు. రైతులు బాధల్లో ఉంటే సంక్రాంతి జరుపుకోవడానికి మనసు రావట్లేదని, ఈ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు.

చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజధాని అమరావతి రైతులకు ప్రజలంతా అండగా ఉండాలని ఆమె అన్నారు. మహిళలు, రైతులు చేసే ఉద్యమాన్ని ఆమె ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, వారికి ఉద్యోగాలు వస్తాయన్న కోరికతో రైతులు  భూములు ఇచ్చారని ఆమె చెప్పారు. లాభాల కోసమే పెట్టుబడులు పెడతారని, ప్రస్తుతం పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని విమర్శించారు. కాగా, అమరావతి పరిరక్షణ సమితికి ఆమె ఇటీవలే తన గాజులను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.