ఢిల్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన బీజేపీ!

12-01-2020 Sun 11:03
  • 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
  • 11న ఫలితాలు
  • సినీ తారలు, పొలిటికల్ లీడర్స్ తో జాబితా

వచ్చే నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు రాజకీయ పార్టీలు సమాయత్తం అయ్యాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఢిల్లీలో అధికారాన్ని పొందాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ, తాజాగా స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది.

పొలిటికల్ లీడర్స్ తో పాటు బాలీవుడ్, భోజ్ పురి తారలు, కళాకారుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోమ్ మంత్రి అమిత్ షాలతో పాటు భోజ్‌ పురి స్టార్ పవన్ సింగ్, ఖేసరి లాల్ యాదవ్, నిర్హువా, రవికిషన్, సన్నీడయోల్, హేమామాలిని, ఉత్తరాదిన అమిత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డ్యాన్సర్ సప్నా చౌదరి, హేమంత్ బిశ్వాశర్మ, సోనేవాల్, గిరిరాజ్ సింగ్, సుశీల్ మోదీ, స్మృతి ఇరానీ, యోగి ఆదిత్యానాథ్, దేవేంద్ర ఫడ్రవీస్, మనోజ్ తివారి తదితరులు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ పేర్కొంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.