ఆరు నెలల్లో ఎనిమిదన్నర కేజీల బంగారం చోరీ : ఎట్టకేలకు చిక్కిన ముఠా!

12-01-2020 Sun 10:25
  • ఐదుగురు సభ్యుల ముఠా మూడు జిల్లాల్లో 45 చోరీలు 
  • వాటాలు కుదరక తమలో ఒకరి హత్య 
  • కేసు విచారణలో బట్టబయలైన నిర్వాకం

ఆరు నెలల కాలం...మూడు జిల్లాలు...నలభై ఐదు చోరీలు...ఎనిమిదిన్నర కేజీల బంగారం అపహరణ...ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పోలీసులకు చిక్కకుండా చేసిన దొంగతనాల వివరాలివి. దొంగిలించిన సొత్తు వాటాలు వేసుకునే క్రమంలో విభేదాలు తలెత్తి ముఠా సభ్యుడు ఒకరు హత్యకు గురికాగా, ఆ కేసు విచారణ సందర్భంగా వీరి చోరీల చిట్టా వెలుగు చూడడంతో పోలీసులే నోరెళ్లబెట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి, ఎస్.రాయవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.

ఎలమంచిలి దరి పెదపల్లికి చెందిన బొద్దపు బాబూరావు, కాకినాడ నల్లపువారి వీధి నివాసి చల్లారామ్మోహనరావు, విశాఖ జిల్లా అగనంపూడికి చెందిన తాటిపూడి శంకర్, సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి చెందిన శెట్టి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన శెట్టి ప్రసాద్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

వీరు విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో నలభై అయిదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 8.5 కేజీల బంగారంతోపాటు పెద్దమొత్తంలో నగదు, వెండి దొంగిలించారు. దొంగిలించిన సొమ్ము పంచుకునే సమయంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పెదపల్లికి చెందిన బాబూరావును కాకినాడకు చెందిన రామ్మోహనరావు హత్య చేశాడు.

ఈ హత్యకేసులో రామ్మోహనరావును అరెస్టు చేసి పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పోలీసులకు వీరి ముఠా, చేసిన దొంగతనాల గురించి తెలియడంతో నోరెళ్లబెట్టారు. మూడు జిల్లాల్లో చేసిన దొంగతనాలు, సొత్తు వివరాలను రామ్మోహనరావు బయట పెట్టాడు.

బంగారాన్ని తాకట్టు కంపెనీల్లో కుదువ పెట్టి డబ్బుతో భూమి కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు వలపన్ని మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.