సుజనా చౌదరి రాజధానిపేర వేల కోట్లు దోచుకున్నారు: ఏపీ మంత్రి కన్నబాబు ఆరోపణలు

11-01-2020 Sat 17:26
  • రాజధాని పేరుతో వేలకోట్లు దండుకున్నారు
  • కాందిశీకుడిగా వెళతాననడం దేశాన్ని అవమానించడమే
  • చంద్రబాబు మాటలతో అమరావతి ప్రాంత రైతులు మోసపోవద్దు

రాజధాని పేరుతో ఎంపీ సుజనా చౌదరి వేలకోట్లు దండుకున్నారని ఏపీ మంత్రి కన్నబాబు విమర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ సుజనా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ రోజు కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సుజనా చౌదరి రాజధానిపేర అక్రమాలకు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల ప్రకటనతో ఆయన దేశం విడిచి వేరే దేశానికి కాందిశీకుడిగా వెళ్లిపోతానని అనడం దేశాన్ని అవమానించడమేనని చెప్పారు. కేసులకు భయపడే ఆయన బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. దేశం వీడడానికి తొందరవద్దంటూ.. త్వరలోనే దోపిడీ వివరాలు బయటపెడతామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విశాఖపై చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ..‘విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని చంద్రబాబు అంటున్నారు.. మరి అమరావతి రాజధాని కావాలని ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేశారా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలతో అమరావతి ప్రాంత రైతులు మోసపోవద్దని హెచ్చరించారు. వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.