అమరావతి ప్రాంతంలో విధించిన సెక్షన్ 144,సెక్షన్ 30లను వెంటనే ఎత్తివేయాలి: ఎంపీ గల్లా జయదేవ్

11-01-2020 Sat 14:54
  • అమరావతిలో ప్రజల హక్కులకు భంగం కలుగుతోంది
  • ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను నిరోధిస్తున్నాయి
  • శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది

అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో రైతులు, మహిళలు చేపడుతున్న శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్, సెక్షన్ 30.. తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్రమించిన హక్కు అని ట్విట్టర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో చట్ట బద్ధంగా భావ ప్రకటన చేసే హక్కు ఉందంటూ.. అటువంటి సందర్భాల్లో వీటిని విధించకూడదని, సుప్రీంకోర్టు తెలిపిందంటూ దానికి సంబంధించిన క్లిప్పింగ్ లను కూడా ఆయన పోస్ట్ చేశారు.  

‘సెక్షన్ 144, సెక్షన్ 30..లను వెంటనే ఎత్తివేయాలి. ఇవి ప్రజాస్వామ్యయుతంగా చేపడుతున్న నిరసనలను నిరోధిస్తున్నాయి. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉంది.  జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి విధిస్తున్న సెక్షన్ 144ను అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై వైసీపీ ప్రభుత్వం విధించి, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోంది. ఈ సెక్షన్ లను వెంటనే ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.